టొరంటో, జూలై 10: కమెడియన్ కపిల్ శర్మ కెనడాలో కొత్తగా ప్రారంభించిన కేఫ్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న కాప్స్ కేఫ్ భవనం వద్దకు కారులో వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడ లేదు. కాగా, కాల్పులకు తామే కారణమంటూ ఖలిస్థాన్ తీవ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ప్రకటించారు.
నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన హర్జీత్ ఎన్ఐఏ లిస్టులో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిగా ఉన్నాడు. కపిల్ శర్మ గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగానే లడ్డీ ఈ కాల్పులకు పాల్పడినట్టు తెలిసింది. కపిల్ శర్మ రెస్టారెంట్ లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారా? లేదా కపిల్‌శర్మకు హెచ్చరిక పంపడానికి ఆ కాల్పులు జరిపారా? అన్నది నిర్ధారణ కాలేదు.