ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 10:27:34

క‌మ‌లా హారిస్‌కు అర్హ‌త లేదు: డోనాల్డ్ ట్రంప్‌

క‌మ‌లా హారిస్‌కు అర్హ‌త లేదు:  డోనాల్డ్ ట్రంప్‌

హైద‌రాబాద్‌: అమెరికా ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా భార‌తీయ సంత‌తిరాలు క‌మ‌లా హారిస్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే క‌మ‌లా హారిస్‌కు అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా పోటీ చేసే అర్హ‌త లేద‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వ‌ల‌స‌వ‌చ్చిన వారికి క‌మ‌లా హారిస్ జ‌న్మించింద‌ని, అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం ఆమెకు ఉపాధ్య‌క్షురాలిగా పోటీ చేసే అర్హ‌త లేద‌ని ఇటీవ‌ల ఓ మేటి క‌న్జ‌ర్వేటివ్ న్యాయ‌వాది పేర్కొన్నారు.  దీంతో క‌మ‌లా హారిస్ జ‌ననంపై వివాదాం నెల‌కొన్న‌ది.  భార‌త్‌కు చెందిన త‌ల్లి, జ‌మైకాకు చెందిన తండ్రికి క‌మ‌లా హారిస్ 1964 అక్టోబ‌ర్ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జ‌న్మించింది. 

డెమోక్ర‌టిక్ అధ్య‌క్ష అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ త‌న డిప్యూటీగా క‌మ‌లా హారిస్‌ను ఎంపిక చేశారు.  అయితే క‌మ‌లా జ‌న‌నంపై వివాదాం నెల‌కొన్న నేప‌థ్యంలో వైట్‌హౌజ్‌లో ఈ అంశంపై ట్రంప్ మాట్లాడారు. ఉపాధ్య‌క్షురాలిగా అయ్యే అర్హ‌త క‌మ‌లాకు లేద‌ని, ఆమె అర్హ‌త గురించి క‌న్జ‌ర్వేటివ్ న్యాయ‌వాది ప్ర‌శ్నించార‌ని ట్రంప్ తెలిపారు. ఆమెను ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ఎంపిక చేసే ముందు డెమోక్రాట్లు ఒక‌సారి చెక్ చేసుకుంటే బాగుండేద‌న్నారు.  క‌మ‌లాకు పోటీ చేసే అర్హ‌త లేద‌న్న సీరియ‌స్ అంశ‌మ‌ని, అంద‌రూ అదే చెబుతున్నార‌ని, ఆమె ఈ దేశంలో పుట్ట‌లేదు కాబ‌ట్టి ఆమెకు అర్హ‌త లేద‌ని ట్రంప్ తెలిపారు. 

అమెరికా రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ రెండు ప్ర‌క‌రాం.. దేశంలో స‌హ‌జ పౌరుడికి పుట్టిన వారికి మాత్ర‌మే అధ్య‌క్ష ఆఫీసుకు ఎన్నిక‌య్యే అర్హ‌త ఉంటుంద‌ని క‌న్జ‌ర్వేటివ్ న్యాయ‌వాది ప్రొఫెస‌ర్ ఈస్ట‌మ‌న్ తెలిపారు. అమెరికాలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు.. రాజ్యాంగంలోని 14వ స‌వ‌ర‌ణ ప్ర‌కారం దేశ పౌరులే అవుతార‌న్నారు. అయితే క‌మ‌లా హారిస్ పుట్టిన స‌మ‌యంలో.. ఆమె పేరంట్స్ స్టూడెంట్ వీసా మీద ఉండి ఉంటార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు.  అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌కు పుట్టిన వారిని అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం పౌరులుగా గుర్తించరు. 

మ‌రికొంత మంది నిపుణులు ఈస్ట్‌మ‌న్ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేస్తున్నారు.  14వ స‌వ‌ర‌ణ‌లో సెక్ష‌న్ వ‌న్ కింద .. అమెరికాలో పుట్టిన ప్ర‌తి ఒక‌రు పౌరులే అవుతార‌ని బ‌ర్కిలీ లా స్కూల్ డీన్ ఎర్విన్ చెమ‌రిన్స్‌కీ తెలిపారు.  1890 నుంచి సుప్రీంకోర్టు ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రో రాజ్యాంగ నిపుణుడు కూడా ఈస్ట్‌మ‌న్ ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేశారు. పుట్టుక‌పై జాతివివ‌క్ష ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ప్రొఫెస‌ర్ లారెన్స్ ట్రైబ్ పేర్కొన్నారు. 
logo