
వాషింగ్టన్, ఏప్రిల్ 29: కరోనా విపత్తు నుంచి, ట్రంప్ నెలకొల్పిన అనిశ్చితి నుంచి అమెరికా బయటపడిందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆయన అధికారం చేపట్టి 100 రోజులు పూర్తైన నేపథ్యంలో ఆ దేశ కాంగ్రెస్‌లో మొదటిసారి మాట్లాడారు. ‘కరోనా విపత్తు నుంచి బయటపడ్డాం. ట్రంప్ ఉన్నప్పటి అనిశ్చితి వాతావరణం ఇప్పుడు లేదు. మనం మళ్లీ పనిచేస్తున్నాం. మళ్లీ కలలు కంటున్నాం. మళ్లీ ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలబడ్డాం’ అని అన్నారు. అమెరికా పునర్నిర్మాణం కోసమంటూ కార్మికుల సంక్షేమం, విద్య తదితరాలకు 1.8 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. ఉద్యోగ కల్పనకు విధానాల రూపకల్పన, ప్రస్తుతం ఉన్న విధానాల్లో మార్పులు చేస్తామన్నారు. సాధారణంగా 1600 అతిథుల మధ్య జరగాల్సిన ఈ కార్యక్రమం కొవిడ్ నిబంధనల వల్ల 200 మందితో నిర్వహించారు. చరిత్రలోనే మొదటిసారిగా ఇద్దరు మహిళలు అమెరికా కాంగ్రెస్‌లో అధ్యక్షుడి వెనుక సీట్లలో కూర్చొని ఉండగా అధ్యక్షుడు ప్రసంగించారు. బైడెన్ తన ప్రసంగానికి ముందు ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్, స్పీకర్ నాన్సీ పెలోసీలకు ధన్యవాదాలు తెలిపారు.
వీలైనంత త్వరగా భారత్‌ను వీడండి
తమ పౌరులకు సూచించిన అమెరికా
కరోనా విజృంభణ నేపథ్యంలో తమ పౌరులు వీలైనంత త్వరగా భారత్‌ను వీడాలని అమెరికా అడ్వైజరీ జారీచేసింది. అలాగే భారత్‌కు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. భారత్‌కు ప్రయాణించడం సురక్షితం కాదని పేర్కొంది. భారత్‌లో పరిస్థితులు మరింత జఠిలం కాకముందే అక్కడ ఉన్న అమెరికన్లు స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. మరోవైపు భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో రద్దీ పెరుగుతున్నది. ఇక్కడ కరోనా కేసులు పెరుగడం, స్వదేశానికి వచ్చేయాలని అమెరికా సూచిస్తుండటమే దీనికి కారణం.