Jeff Bezos | అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్(American newspaper Washington Post )ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఫుట్ బాల్ టీమ్ వాషింగ్టన్ కమాండర్స్ (football team Washington Commanders)ను కొనుగోలు చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మడం లేదని తెలిపారు.
వాషింగ్టన్ పోస్ట్‌ను బెజోస్ 2013లో 250 మిలియన్ అమెరికన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. ఇటీవల బెజోస్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. న్యూస్ పేపర్ ను సొంతం చేసుకోవడం తన లక్ష్యం కాదని వ్యాఖ్యానించారు. తనకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చారు. అయితే ఏదైనా జాతీయ ఫుట్ బాల్ జట్టును సొంతం చేసుకోవాలనే విషయంపై మాత్రం ఆయన బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్టును అమ్మకానికి పెట్టాడంటూ జాతీయ మీడియాలో వార్తలు రావడం గమనార్హం.