Microplastics | టోక్యో, సెప్టెంబర్ 28: రోజురోజుకూ ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో అది సర్వాంతర్యామి అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. తాజాగా జపనీస్ పరిశోధకులు మేఘాల్లో మైక్రోప్లాస్టిక్‌ను గుర్తించారు. మౌంట్ ఫుజి, మౌంట్ ఒయామా పర్వతాలపై పొగమంచు నుంచి నీటిని సేకరించి అడ్వా న్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా వాటి భౌతిక, రసాయన ధర్మాలను విశ్లేషించారు.
ఈ నమూనాలో 9 రకాల మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్టు తేల్చారు. ఈ మైక్రోప్లాస్టిక్ పరిమాణం 7.1 నుంచి 94.6 మైక్రో మీటర్లు ఉన్నట్టు గుర్తించారు. మేఘంలోని ఒక్కో లీటర్ నీటిలో 6.7 నుంచి 13.9 ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్టు తేల్చారు. ప్లాస్టిక్ వాయు కాలుష్యంపై అప్రమత్తం కాకుంటే భవిష్యత్తులో తీవ్రమైన పర్యావరణ నష్టం తప్పదని పరిశోధకులు హెచ్చరించారు.