న్యూఢిల్లీ: కొవిడ్-19 నుంచి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన/బలహీనమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌తో తిరిగి వచ్చింది. 17 ఏళ్ల డేటా ఆధారంగా ఇండెక్స్‌ను విడుదల చేసింది. జపాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచింది. జపాన్ పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 193 దేశాలకు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు. అంటే, జపాన్ పాస్‌పోర్ట్ ఉన్నవారు 193 దేశాలకు వీసా లేకుండా కానీ, ఆ దేశంలో దిగగానే విమానాశ్రయంలోనే వీసా పొందే అవకాశంతో కానీ ప్రయాణం చేయొచ్చు.
జపాన్ తర్వాతి స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ ఇండెక్స్‌లో భారత్ 87వ స్థానంలో ఉంది. నేపాల్, ఇండోనేషియా, భూటాన్, మకావుతో సహా 60 గమ్యస్థానాలకు వీసా-రహిత/వీసా-ఆన్-అరైవల్ యాక్సెస్‌ను అందిస్తోంది. ఇటీవల, ప్రభుత్వ డేటా ప్రకారం 2021లో 1.6 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు, ఇది గత ఐదేళ్లలో అత్యధికం. వారిలో ఎక్కువ మంది యునైటెడ్ స్టేట్స్ (78,284), ఆస్ట్రేలియా (23,533), కెనడా (21,597) , యూకే (14,637)కు వలస వెళ్లారు.
శక్తివంతమైన పాస్‌పోర్ట్ అంటే ఏమిటి? వాటితో లాభాలేంటి?
పాస్‌పోర్ట్‌ల మొబిలిటీ స్కోర్ ఆధారంగా ర్యాంక్ నిర్ధారిస్తారు. మొబిలిటీ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ అంత మెరుగ్గా ఉంటుంది. వీసా రహితంగా లేదా వీసా ఆన్ అరైవల్తో ఆమోదించే పాస్‌పోర్ట్‌ల సంఖ్య ఆధారంగా దేశాల ర్యాంకులు నిర్ణయిస్తారు.
విదేశీ పర్యటనలకు వీసా కచ్చితంగా ఉండాలి. ఇందుకోసం డబ్బు కట్టి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్వ్యూ, ఆపై ప్రాసెసింగ్ పూర్తయితేనే వీసా వస్తుంది. అలాంటి వీసా అవసరమే లేకుండా పాస్‌పోర్ట్‌తోనే విదేశీ పర్యటనలకు వెళ్తే ఎంతో బాగుంటుంది కదా. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య ఈ సదుపాయం ఏర్పడుతుంది. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందాల కారణంగా ఆయా దేశాల్లో వీసా ఫ్రీ పర్యటనకు అవకాశం లభిస్తుంది.