వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత భయానకమైన దయ్యాల కొంప అమ్మకానికి సిద్ధంగా ఉంది. అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో దీనిని 18వ శతాబ్దంలో 8.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇక్కడ దయ్యాలు, ఆత్మలకు సంబంధించిన భయంకర సంఘటనలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నది. హాలీవుడ్ హారర్ సినిమా ‘ది కంజురింగ్’కు ఈ ఇల్లు స్ఫూర్తిగా నిలిచింది. దీనిని 2022లో జాక్వెలిన్ నూనెజ్ రూ. 13.5 కోట్లకు కొన్నారు.
అనంతరం ఇక్కడ ఘోస్ట్ టూరిజం బిజినెస్‌ను ప్రారంభించారు. ఇక్కడ బస చేసేవారు దయ్యాలను గుర్తించేందుకు ప్రయత్నించేవారు. ఈ ఇంటి మాజీ యజమాని జాన్ ఆర్నాల్డ్ తనకు కలలో కనిపించి, ఈ ఇంటి మేనేజర్ దొంగతనం చేస్తున్నట్లు చెప్పారంటూ, ఆ మేనేజర్‌ను నూనెజ్ తొలగించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2023 నవంబరులో స్థానిక అధికారులు నూనెజ్ టూరిజం లైసెన్స్‌ను రద్దు చేశారు. ఈ నెల 31న ఈ ఇంటిని వేలం వేస్తారు.