టెల్ అవివ్: గాజాలో జరిగిన ఇజ్రాయిల్ డ్రోన్ దాడిలో ఏడు మంది ఎన్జీవో ఛారిటీ సిబ్బంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల ఇజ్రాయిల్ మిలిటరీ(Israeli Military) చర్యలు తీసుకున్నది. ఇద్దరు ఆఫీసర్లను తొలగించినట్లు చెప్పింది. మరో ముగ్గురు అధికారుల్ని నిలదీసింది. కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయిలీ సైనిక దళాలు తప్పుగా వాడుకున్నాయని, ఆర్మీ రూల్స్‌ను వాళ్లు ఉల్లంఘించినట్లు మిలిటరీ పేర్కొన్నది. హమాస్ దళాన్ని టార్గెట్ చేస్తున్నట్లు అంతర్గతంగా అంచనా వేయడం వల్ల ఆ ఘటన జరిగిందని మిలిటరీ తెలిపింది. ఇజ్రాయిల్ జరిపిన దాడిలో వరల్డ్ సెంట్రల్ కిచన్ సంస్థకు చెందిన సిబ్బంది మృతిచెందారు. తీవ్రమైన తప్పిదం వల్ల ఆ మరణాలు సంభవించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొన్నది. డ్రోన్ అటాక్ పట్ల వ్యక్తిగత విచారణ చేపట్టాలని ఓ సంస్థ డిమాండ్ చేసింది.