జెరూసలేం: తాను మరణం అంచున ఉన్నానని, బతికే అవకాశం లేక తన సమాధి తానే తవ్వుకుంటున్నానని చిక్కి శల్యమై ఉన్న 24 ఏండ్ల ఇజ్రాయెల్ బందీ ఒకరు మాట్లాడే ఓపిక లేక తీవ్ర ఆవేదనతో చెబుతున్న వీడియో వైరల్గా మారింది. తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుడి వీడియోను పాలస్తీనాలోని హమాస్ సంస్థ షేర్ చేసింది.
ఈ వీడియోలో పార పట్టుకుని ఉన్న 24 ఏండ్ల ఎవ్యాతార్ డేవిడ్ అండర్ గ్రౌండ్ సొరంగంలో నిల్చుని ఉన్నాడు. ‘నా గమ్యం సమాధి వైపే.. అందుకే నా సమాధిని నేనే తవ్వుకుంటున్నా.. ఇక్కడే నే సమాధి అవుతా. ఈ బంధనాల నుంచి తప్పించుకుని నా కుటుంబంతో నిద్రపోయే సమయం చాలా తక్కువ ఉంది’ అంటూ డేవిడ్ వ్యక్తం చేసిన ఆవేదన చూపరులను కంటతడి పెట్టిస్తున్నది.