జెరుసలాం: పాలస్తీనాకు చెందిన హమాస్ చేస్తున్న అటాక్ వల్ల సుమారు 1300 మంది ఇజ్రాయిలీలు మృతిచెందినట్లు(Israeli Death Toll) హిబ్రూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా సుమారు 150 మంది ఇజ్రాయిల్ వ్యక్తుల్ని హమాస్ బంధించిందని, వారిని గాజా స్ట్రిప్ వైపు తీసుకువెళ్లిందని, అయితే ప్రస్తుతం ఆ బంధీల పరిస్థితి ఏంటన్న విషయం ఇంకా తెలియదని ఇజ్రాయిల్ దళాలు పేర్కొన్నాయి. హమాస్ అటాక్ వల్ల సుమారు 3300 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దీంట్లో 28 మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. 350 మంది కండీషన్ చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరో రోజున మళ్లీ రాకెట్ల వర్షం కురిసింది. గత పది గంటల పాటు మౌనంగా ఉన్న హమాస్.. ఇప్పుడిప్పుడే మళ్లీ రాకెట్లను ఫైర్ చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఇజ్రాయిల్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇవాళ రాకెట్ అలర్ట్ సైరన్లు మోగాయి. ఈవెన్ యెహుదా, తైయిబి, ఏరియల్, కఫర్ యోనా ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయి. కొన్ని పేలుళ్ల శబ్ధాలు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. దాదాపు 10 గంటల బ్రేక్ తర్వాత మళ్లీ రాకెట్లు దూసుకువచ్చినట్లు తెలుస్తోంది.