Israel Strikes | గాజాస్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు గాజాస్ట్రిప్‌పై జరిపిన వైమానిక దాడుల్లో 103 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఖాన్ యూనిస్ నగరంలోనే 48 మందికిపైగా మరణించారని నసీర్ దవాఖాన వెల్లడించింది. వీరిలో 18 మంది చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది. జబలియా శరణార్థి శిబిరంపై జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా వైద్య శాఖ వెల్లడించింది. జబలియాలోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో 10 మంది మృతిచెందినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ బాంబు దాడుల నేపథ్యంలో ఉత్తర గాజాలో పనిచేస్తున్న ఏకైక ప్రధాన దవాఖానను మూసివేశారు. దీంతో ఉత్తర గాజాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సేవలు నిలిచిపోయాయని గాజా వైద్య శాఖ తెలిపింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మిగిలిన బందీలను విడుదల చేసేలా హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు గాజాలో విస్త్రృత గ్రౌండ్ ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు వెళ్లకుండానే మధ్యప్రాచ్య పర్యటనను ముగించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి గాజాలో 3 వేల మందికిపైగా మరణించారు.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ మాజీ నేత యహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వార్ మృతి చెందాడు. ఖాన్ యూనిస్‌లోని ఒక గుహలో అతని మృతదేహం లభ్యమైనట్టు స్థానిక వార్తా కథనాలు వెల్లడించాయి.