Israel-Iran Conflict | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. రోజు రోజుకు దాడులు పెరుగుతుండడంతో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా చేసిన హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బుధవారం ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్‌పై దాడి చేసి ఇజ్రాయెల్ పెద్ద తప్పు చేసిందని ఖమేనీ అన్నారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదంటూ ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ యుగం ముగిసిందని.. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ పాలన తెలుసుకోవాలన్నారు. చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తారన్నారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ఇరాన్ హెచ్చరిస్తూ.. లొంగిపోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెలివిజన్ ప్రసంగంలో ఖమేని మాట్లాడుతూ ఇజ్రాయెల్ భయంకర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులకు టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పారు. జియోనిస్ట్ పాలన పెద్ద తప్పు చేసిందని.. దాని చర్యలకు శిక్ష తప్పదన్నారు.
ఇరాన్ లొంగిపోదని అమెరికాకు సందేశం ఇస్తూ.. యూఎస్ దాడి తీవ్రమైన కోలుకోలేని పరిణామాలను కలిగిస్తుందని హెచ్చరించారు. తమ సాయుధ దళాలు మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇరాన్ దేశం లొంగిపోదని.. ఏదైనా సైనిక జోక్యం నిస్సందేహంగా కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేసిన తర్వాత ఖమేని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీ ఎక్కడ ఉన్నాడనేదానిపై తమకు సమాచారం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరుసగా ఆరోజు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మెహ్రాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని ఇరాన్ రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు చేసింది. శుక్రవారం నుంచి ఇరాన్ అంతటా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 585 మంది మరణించగా, 1,326 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ బుధవారం అంతర్జాతీయ మీడియా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణి దాడులు టెల్ అవీవ్‌లోని అనేక ప్రాంతాలను తాకగా.. భారీగా నష్టం వాటిల్లింది.