Israel-Lebanon Tension | పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్నది. మొన్నటి వరకు గాజాపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తాజాగా.. లెబనాన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్నది. హిజ్బొల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పౌరులు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. దాడుల్లో ఇప్పటికే హెజ్బొల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది.
అలాగే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరూషన్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. నస్రల్లా మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయత్లులా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా ఇజ్రాయెల్ మరో కీలక విజయం సాధించింది. హిజ్బొల్లా కమాండ్ నబిల్ కౌక్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. నబిల్ కౌక్ మరణాన్ని హిజ్బొల్లా ధ్రువీకరించనప్పటికీ.. మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడిలో నస్రల్లా ప్రాణాలు కోల్పోయిన మరునాడే నబిల్ కౌక్‌ను సైన్యం హతమార్చింది. నబిల్ ప్రస్తుతం హిజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.