న్యూఢిల్లీ, జూన్ 1: హమాస్ చీఫ్ కమాండర్ మహమ్మద్ సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) మూడు వారాల తర్వాత ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. అత్యంత రహస్య స్థావరంలో తలదాచుకుని, కార్యకలాపాలు నిర్వహిస్తున్న హమాస్ నేతలను పక్కా ప్రణాళిక ప్రకారం హతమార్చామని తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ భద్రతా సంస్థ(ఐఎస్ఏ)తో కలిసి మే 13న జరిపిన దాడిని వివరించే ఓ త్రీడీ వీడియో విడుదల చేసింది. గాజా ఖాన్‌యూనిస్ ప్రాంతంలోని ఓ దవాఖాన కింద సొరంగమార్గం, హమాస్ కంబాట్ కంట్రోల్ సెంటర్ లక్ష్యంగా వైమానిక దాడులు చేశామని పేర్కొంది. ఈ సర్జికల్ స్ట్రయిక్‌లో దవాఖానకు, పౌరులకు ఎవరికీ హాని జరగకుండా కచ్చితత్వంతో కూడిన దాడి చేశామని, 30 సెకన్లలో 50 బాంబులను ప్రయోగించామని వెల్లడించింది.
కచ్చితమైన నిఘా సమాచారం, వైమానిక పర్యవేక్షణ ద్వారానే ఇది సాధ్యమైందని పేర్కొంది. హమాస్ ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో సిన్వర్‌తో పాటు మరో కీలకనేత మహమ్మద్ షబానా కూడా హతమయ్యాడని తెలిపింది. 2023 అక్టోబర్ 7న మొదలైన యుద్ధంలో జరిపిన కీలక నేతల ఏరివేతలో ఇదొక కీలకమైన దాడి అని పేర్కొంది. హామాస్ టాప్ లీడర్ యహ్యా సిన్వర్ తమ్ముడే మహమ్మద్ సిన్వర్ అని వెల్లడించింది. దాడి ఉద్దేశం కేవలం హమాస్ కమాండ్ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే కాకుండా నిఘా సమాచారంతో, కచ్చితమైన దాడి చేయగలమనే సందేశం పంపడం కూడా లక్ష్యమని స్పష్టంచేసింది. హమాస్ కీలక నేతలను అంతమొందించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత ఐడీఎఫ్ ఈ వీడియో విడుదల చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో 16 మంది చనిపోయారని, 70మంది గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో సిన్వర్ ఉన్నట్టు ధ్రువీకరించలేదు.