Israel attack : గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం (Israeli army) దక్షిణ గాజాలోని ప్రముఖ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. దాడుల అనంతరం ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకంటే ముందు దక్షిణా గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది.
దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ సీనియర్ నాయకునితో సహా 26 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల వైమానిక దాడులతో ఇజ్రాయెల్ గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మృతులు, గాయపడిన వారిని నాసర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రిపై దాడిని ధృవీకరించింది. యాక్టివ్‌గా ఉన్న హమాస్ ఉగ్రవాదులపై దాడి జరిగిందని తెలిపింది. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక లక్షా 13 వేల మందికి పైగా జనం గాయపడ్డారని పేర్కొంది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 673 మంది మృతిచెందారు.
మొత్తం మృతుల్లో 15,613 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో 872 మంది ఏడాది లోపు వయసు కలిగినవారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం 2023 అక్టోబర్ 7న ప్రారంభమైంది.