Israel attack : ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ వైమానిక దాడుల్లో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 72 మంది గాయపడ్డారు. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల సమయంలో ఆ ప్రాంతంలోని ప్రజలు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అయినా కొందరు బలయ్యారని అధికారులు తెలిపారు. వైమానిక దాడుల కారణంగా దక్షిణ బీరుట్‌లోని దహియేలో సైతం పలు భవనాలు ధ్వంసమయ్యాయి. అయితే అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
మరోవైపు హెజ్బొల్లా బలగాలు కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది గాయపడినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం హమాస్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరులో హెజ్బొల్లా తలదూర్చింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడటంతో.. ఇజ్రాయెల్ అటు గాజాలోని హమాస్‌తోపాటు, లెబనాన్‌లోని హెజ్బొల్లాతో యుద్ధం చేస్తోంది.