Hamas | జెరూసలేం, అక్టోబర్ 18 : హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అక్టోబర్ 7న గాజాలో జరిపిన దాడుల్లో సిన్వర్ మరణించినట్టు తాజాగా ప్రకటించింది. ఏడాది క్రితం ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ఉగ్రవాద, రాజకీయ సంస్థ అయిన హమాస్ దారుణంగా నష్టపోయింది. జూలైలో ఇస్మాయిల్ హనియా, తాజాగా సిన్వర్ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడంతో ఇప్పుడు హమాస్‌ను నడిపించే నాయకుడు కరువయ్యాడు. ఈ నేపథ్యంలో హమాస్ కొత్త అధినేత రేసులో ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
హమాస్ కాబోయే అధినేతగా యాహ్యా సిన్వర్ తమ్ముడు మహమ్మద్ సిన్వర్(49) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. హమాస్ మిలిటరీ కమాండర్లలో మహమ్మద్ కీలక వ్యక్తి. 2011లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షలిత్‌ను మహమ్మద్ సిన్వర్ అపహరించాడు. తమ సైనికుడిని క్షేమంగా తెచ్చుకునేందుకు యాహ్యా సిన్వర్‌తో పాటు దాదాపు వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి వచ్చింది.
ఖలిక్ అల్హయ్య ఖతార్ కేంద్రంగా హమాస్ కోసం పని చేస్తాడు. హమాస్ రాజకీయ విభాగంలో కీలక వ్యక్తి. దోహాలో జరిగిన కాల్పుల విరమణ చర్చల్లో కీలకంగా వ్యవహరించాడు. జూలైలో హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హతమార్చినప్పుడు కూడా హమాస్‌కు నాయకత్వం వహించబోతున్నాడని ఖలిక్ పేరు వినిపించింది. 2007లో గాజాలో తన ఇంటి మీద జరిగిన దాడి నుంచి ఖలిక్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
హమాస్ వ్యవస్థాపకుల్లో జహర్ ఒకడు. గాజాలో వైద్యుడిగా పని చేయడంతో పాటు హమాస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. 2006లో పాలస్తీనియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికవడంతో పాటు విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశాడు. అయితే, జహర్ కూడా అక్టోబర్ 7 నుంచి కనిపించడం లేదని తెలుస్తున్నది.
హమాస్ ఏర్పాటుకు కారణమైన ముస్లిం బ్రదర్హుడ్ ఏర్పాటులో మర్జౌక్ది కీలకపాత్ర. హమాస్ రాజకీయ విభాగంలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో 1990లలో అమెరికాలోని మన్‌హట్టన్ జైలులో రెండేండ్లు శిక్ష అనుభవించాడు. తర్వాత అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకొని జోర్డన్‌లో స్థిరపడ్డాడు.
1996లో హమాస్ రాజకీయ విభాగానికి అధినేతగా మషల్ పని చేశాడు. రెండేండ్ల తర్వాత జోర్డన్‌లో మషల్కు ఇజ్రాయెల్ స్లో పాయిజన్ ఇవ్వడంతో కోమాలోకి వెళ్లాడు. తర్వాత జోర్డన్‌తో జరిగిన దౌత్య ఒప్పందంలో భాగంగా మషల్కు ఇజ్రాయెల్ యాంటీడోస్ ఇవ్వడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. మషల్ ప్రస్తుతం ఖతర్‌లో నివశిస్తున్నట్టు తెలుస్తున్నది.