ఢాకా: ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, రిజర్వేషన్ల ఆందోళనల మాటున దేశంలో హిందూ ఆలయాలపై దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా ఖుల్నా డివిజన్లోని మెహర్‌పూర్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌పై (ISKCON Temple) దాడిచేశారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. విగ్రహాలను పగులగొట్టారు. ఆ ప్రతిమలను కాల్చివేశారు.
దేశంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు పతాక స్థాయికి చేరడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరకు ఆమెనే గద్దె దింపింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన మహిళగా ఘనత వహించిన హసీనా ప్రజా ఉద్యమానికి జడిసి పదవిని వదులుకున్నారు. ఎన్నికల్లో తిరుగులేని ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అవమానకర రీతిలో దేశాన్ని వీడి పరారయ్యారు. భారత్ చేరుకున్న ఆమె మరికొన్నిరోజుల పాటు ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తున్నది. రాజకీయ శరణార్థిగా యూకే ఆశ్రయం కోరినట్లు తెలుస్తున్నది. దీనిపై యూకే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అక్కడికి వెళ్లనున్నారు. కాగా, రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను.. జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోభాల్ కలిశారు.