Iraq | బాగ్దాద్, నవంబర్ 10: మహిళల హక్కుల్ని హరించేలా ఇరాక్ పాలకులు వివాహ చట్టాల్ని సవరించేందుకు సిద్ధమయ్యారు. బాలికల వివాహ వయసును 9 ఏండ్లకు తగ్గిస్తూ అక్కడి సంకీర్ణ సర్కార్ చట్టాల్ని సవరించబోతున్నది. అంతేగాక మహిళలు విడాకులు పొందే హక్కు, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులను సైతం హరించే అంశాలు ప్రతిపాదిత బిల్లులో ఉన్నాయని ‘ద టెలిగ్రాఫ్’ వార్తా కథనం పేర్కొన్నది. దీనిపై మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్త్రీల హక్కుల్ని తుడిచిపెట్టి, పూర్తిగా మతానికి ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆగ్రహం వ్యక్తమైంది. బాలికలపై లైంగిక, శారీరక హింస పెరుగుతుందని, మహిళలు విద్య, ఉపాధి హక్కును కోల్పోతారని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ పేర్కొన్నది. ఇరాకీ మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, పార్లమెంట్లో మెజార్టీ ఉండటంతో ముసాయిదా చట్టాన్ని అమలుజేయాలని సంకీర్ణ సర్కార్ భావిస్తున్నది.