టెహ్రాన్: ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు పలుకుతూ ఫ్రాన్స్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. 14 పాయింట్ల డాక్యుమెంట్‌పై ట్రంప్‌తో పాటు ఇరానీ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిజిటల్ సంతకాలు చేశారు. అయితే ఆ ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చినట్లు పాకిస్థానీ మీడియేటర్లు వెల్లడించారు. ఇక ట్రంప్ సంతకం చేసిన ఆ ఒప్పందంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాపై తాము దౌత్యపరమైన విజయాన్ని సాధించామని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. అమెరికా తన మిలిటరీ లక్ష్యాలను అందుకోలేకపోయిందని ఆ అధికారులు ఆరోపించారు. ఇరానీ పార్లమెంటరీ స్పీకర్, అమెరికాతో చర్చల్లో పాల్గొన్న మొహమ్మద్ ఘలీబాఫ్(Mohammad Ghalibaf) మాట్లాడుతూ.. అమెరికా లొంగిపోయిందని చెప్పడానికి ట్రంప్ చేసిన ఒప్పంద సంతకమే సాక్ష్యమని తెలిపారు. ఆ అగ్రిమెంట్ అనేది అమెరికా వైఫల్యానికి ఆధారామన్నారు. ఇరానీ టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఘలీబాఫ్ మాట్లాడుతూ.. ప్రజలు ఆ అగ్రిమెంట్‌ను పరిశీలించి, దానిపై నిర్ణయాన్ని అంచనా వేస్తారన్నారు.
హోర్ముజ్ జలసంధి మళ్లీ సాధారణ పరిస్థితులకు రాదు అని గట్టిగా చెబుతున్నానని ఘలీబాఫ్ అన్నారు. హోర్ముజ్‌పై సార్వభౌమాధికారం ఇరాన్‌కు ఉందని ఆయన అన్నారు. తాము చేసే సేవలకు ఫీజు తీసుకుంటామని కూడా ఘలీబాఫ్ అన్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ భాగేహి మాట్లాడుతూ హోర్ముజ్ జలసంధి పునరుద్దరణ కోసం నియమావళిని రూపొందిస్తామన్నారు. దీని కోసం ఒప్పందంలో భాగంగా ఒమన్‌తో చర్చలు జరుపుతామన్నారు. ఒకవేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపకుంటే, అప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా భావిస్తామన్నారు.
వాస్తవానికి ట్రంప్ చేసిన శాంతి ఒప్పందం సంతకం .. తుది ఒప్పందం కాదు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న వివిధ అంశాలపై చర్చించేందుకు మరో 60 రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు, ఆంక్షల సడలింపు, ఆస్తులను రిలీజ్ చేయడం, హోర్ముజ్ భవిష్యత్తుపై రాబోయే 60 రోజుల్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆ ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం ఇస్తుంది. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ కనుసన్నల్లోనే అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయనున్నారు.