టెల్ అవివ్: ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున మిస్సైళ్ల(Iranian Missile)తో అటాక్ చేసింది. అయితే ఆ దాడి వల్ల దక్షిణ ఇజ్రాయిల్‌లోని ప్రధాన ఆస్పత్రి ధ్వంసమైంది. బీర్షెబాలోని సోరోకా ఆస్పత్రి ఆ దాడిలో దెబ్బతిన్నది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది గాయపడ్డారు. డ్యామేజ్ చాలా విస్తృత స్థాయిలో జరిగినట్లు ఇజ్రాయిలీ మంత్రి పేర్కొన్నారు.
సోరోకా ఆస్పత్రి నుంచి దట్టమైన పొగ వస్తున్న విజువల్స్ రిలీజ్ చేశారు. ఆ ఆస్పత్రి కిటికీలు ధ్వంసం అయ్యాయి. ప్రజలు చికిత్స కోసం రావద్దు అని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కావాలనే సోరోకా ఆస్పత్రిపై ఇరాన్ దాడి చేసిందని, క్రిమినల్ చర్యకు పాల్పడినట్లు ఇజ్రాయిలీ డిప్యూటీ విదేశాంగ మంత్రి తెలిపారు.
ఇరాన్ దాడి చేసింది మిలిటరీ బేస్ కాదు అని, అది ఆస్పత్రి అని షారెన్ హస్కెల్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇజ్రాయిల్‌లోని నిగేవ్ ప్రాంతంలో ఇదే కీలకమైన మెడికల్ సెంటర్ అని షారెన్ వెల్లడించారు. ఆస్పత్రిలో జరిగిన నష్టానికి చెందిన వీడియోను కూడా పోస్టు చేసిందామె. ఇరాన్ చేసిన తాజా దాడుల్లో అనేక మంది గాయపడ్డారు. 32 మందికి పారామెడిక్స్ చికిత్స చేసినట్లు ఇజ్రాయిల్ ఎమర్జెన్సీ సర్వీస్ మేగన్ డేవిడ్ ఆడమ్(ఎండీఏ) పేర్కొన్నది . పేలుడు, పదునైన వస్తువుల వల్ల ఎక్కువ మందికి గాయాలు అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సొరోకా మెడికల్ సెంటర్లో వెయ్యి పడకలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న సుమారు పది లక్షల మంది పౌరులు అక్కడ చికిత్సకు వస్తుంటారు.