టెహ్రాన్: అమెరికా దళాలపై ఇరాన్(Iran Strikes) విరుచకుపడింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా దళాలకు చెందిన ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి చేసింది ఇరాన్. అయితే ఈ దాడి గురించి జోర్డాన్ కానీ, అమెరికా కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్‌పైకి క్షిపణులతో దాడి చేసినట్లు ఇరానీ పారామిలిటరీ రెవల్యూషనర్ గార్డులు పేర్కొన్నారు. ఈ ఎయిర్‌బేస్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాలతో పాటు ఇతర విమానాలు ఉన్నాయి. హోర్ముజ్ వద్ద మంగళవారం అమెరికాకు చెందిన ఆర్మీ అపాచీ హెలికాప్టర్ కూలిన విషయం తెలిసందే. ఆ ఘటన నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగింది. దీంతో ఆ దాడుల్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. బుధవారం అమెరికా మిలిటరీ వైమానిక దాడులకు పాల్పడింది. అయితే ఇరాన్ కౌంటర్ దాడికి దిగింది. దీంతో బహ్రెయిన్ ద్వీపంపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంద. ఆ ద్వీపంలో అమెరికా నౌకాదళానికి చెందిన ఫిప్త్ ఫ్లీట్ బస చేస్తోంది. అయితే ఆ నౌకాదళంపై ప్రతీకార దాడులకు పాల్పడినట్లు ఇరాన్ పేర్కొన్నది.
అమెరికా వైమానిక దళం, నేవీ చేసిన దాడులపై సెంట్రల్ కమాండ్ అప్డేట్ ఇచ్చింది. ఎయిర్ డిఫెన్స్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రేడార్ సైట్లను ధ్వంసం చేసినట్లు అమెరికా చెప్పింది. బందర్ అబ్బాస్‌తో పాటు ఖాసిమ్ ద్వీపాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అంగీకరించింది. కానీ నష్టానికి చెందిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నేవీకి చెందిన 5వ ఫ్లీట్‌ను టార్గెట్ చేసినట్లు ఇరాన్ పేర్కొన్నది. కువైట్‌లో అమెరికా దళాలు బస చేస్తున్న ప్రదేశంపై డ్రోన్‌తో దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొన్నది.
ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడం వల్లే ఏహెచ్-64 అపాచీ ఆర్మీ హెలికాప్టర్ కూలినట్లు యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ తమ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అయితే కావాలని ఆ హెలికాప్టర్‌ను కూల్చారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న విషయాన్ని ఇంకా తేల్చలేదు.