టెహ్రాన్, జనవరి 1: ఇరాన్ సుప్రీమ్ నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా గతవారం రోజులుగా సాగుతున్న నిరసనలు నూతన సంవత్సరం నాడు హింసాత్మకంగా మారాయి. పలువురు నిరసనకారులతోపాటు ఓ భద్రతా సిబ్బంది ఈ ఘర్షణల్లో మరణించినట్లు ఇరాన్ మీడియా, హక్కుల గ్రూపులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. కొత్త సంవత్సరం రాకతో ప్రజా నిరసనలు దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. దేశవ్యాప్తంగా భద్రతా దళాలతో నిరసనకారులు తలపడ్డారు.
ఈ ఘర్షణల్లో ముగ్గురు పౌరులు మరణించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. నియంత(ఖమేనీ)కు మరణదండన విధించాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు టెహ్రాన్ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. 1979 ఇస్లామిక్ విప్లవం సందర్భంగా పదవీచ్యుతుడైన అమెరికా మద్దతుదారు షా మొహమ్మద్ రేజా పహ్లావీ కుమారుడు రేజా పహ్లావీకి అనుకూలంగా విద్యార్థులు నినాదాలు చేశారు. టెహ్రాన్ వ్యాప్తంగా షాకు కీర్తిస్తూ నినాదాలు మార్మోగిన దరిమిలా అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న రేజా పహ్లావీ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాను మీతోనే ఉన్నానని, తమ పోరాటం న్యాయమైనది కాబట్టి విజయం తమదేనని ఆయన నిరసనకారులను ఉద్దేశించి ప్రకటించారు. ధరల పెరుగుదలపై గత మూడేండ్లుగా ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు చెలరేగాయి. లార్డేగన్, కుహదష్ట్, ఇస్ఫాహన్లో మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చాయి.