వాషింగ్టన్: ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ) సైంటిస్ట్ డాక్టర్ స్వాతి నాయక్ ప్రతిష్ఠాత్మక నార్మన్ ఈ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. క్షేత్ర స్థాయి పరిశోధన, అనువర్తనలో ఆమె కృషికి గుర్తింపుగా 2023వ సంవత్సరానికి ఆమెకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఓ ట్వీట్లో తెలిపింది. ఆమె అసాధారణ యువ శాస్త్రవేత్త అని ప్రశంసించింది.
న్యూఢిల్లీలోని ఐఆర్ఆర్ఐలోని సీడ్ సిస్టమ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ దక్షిణాసియా విభాగానికి ఆమె నేతృత్వం వహిస్తున్నారు. ఆహారం, పోషకాహార భద్రత, ఆకలి నిర్మూలన రంగం లో విశేష కృషి చేసిన 40 ఏళ్లలోపు వయసుగల శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. నోబెల్ బహుమతి గ్రహీత, హరిత విప్లవం ప్రధాన రూపశిల్పి డాక్టర్ నార్మన్ బోర్లాగ్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.