న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్(Instagram) సోషల్ మీడియా యాప్‌కు ఇప్పుడు ఫుల్ క్రేజీ ఉంది. రీల్స్ పేరుతో యూజర్లు ఇన్‌స్టాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. అయితే ఆ వీడియోల గురించి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నది. పాత వీడియోలు, పాపులర్ కానీ వీడియోల క్వాలిటీని తగ్గిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ పేర్కొన్నది. ఆ ప్లాట్‌ఫామ్ అధినేత ఆడమ్ మొసేరి ఈ విషయాన్ని తెలిపారు. ఎక్కువ వ్యూవ్స్‌ను ఆకర్షించే వీడియోల క్వాలిటీని హై రేంజ్‌లోనే ఉంచనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఇన్‌స్టాలో ఎక్కువగా వీడియోలను వీక్షిస్తుంటారని, ఒకవేళ ఆ వీడియోలకు వ్యూవ్స్ లేని పక్షంలో..వాటి క్వాలిటీని తగ్గించనున్నట్లు ఆడమ్ తెలిపారు. ఒకవేళ కొంత కాలం తర్వాత ఆ వీడియోకు పాపులారిటీ వస్తే, అప్పుడు ఆ క్వాలిటీని పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. పాపులారిటీ ఆధారంగా రకరకాల వీడియోలకు ప్రత్యేకంగా కోడింగ్ చేయనున్నట్లు గతేడాది మెటా సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.