Indian Visitors | న్యూఢిల్లీ, వాషింగ్టన్ : అమెరికాలో పర్యటించే భారతీయ సందర్శకుల (Indian Visitors) సంఖ్య తగ్గింది. ఏటా జూన్‌లో అమెరికాకు భారతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిరుడు జూన్‌లో 2.3 లక్షల మంది వెళ్లగా, ఈ ఏడాది జూన్‌లో 2.1 లక్షల మంది వెళ్లారు. అంటే, 8 శాతం తగ్గుదల నమోదైంది. ఈ స్థాయిలో తగ్గుదల నమోదు కావడం ఈ మిలీనియంలో ఇదే తొలిసారి. నిరుడు జూలైలో కన్నా ఈ ఏడాది జూలైలో 5.5 శాతం తగ్గుదల కనిపించింది. ఈ వివరాలను అమెరికా వాణిజ్య శాఖకు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ వెల్లడించింది.
మొత్తం మీద చూసినపుడు, కొన్ని నెలల నుంచి అమెరికాకు ఇతర దేశాల నుంచి వెళ్లే సందర్శకులు తగ్గిపోతున్నారు. నిరుడు జూన్‌తో పోల్చుకుంటే, ఈ ఏడాది జూన్‌లో 6.2 శాతం తగ్గిపోయారు. నిరుడు మే నెలలో కన్నా ఈ ఏడాది మే నెలలో 7 శాతం మంది, నిరుడు మార్చితో పోల్చినపుడు ఈ ఏడాది మార్చిలో 8 శాతం మంది, నిరుడు ఫిబ్రవరిలో కన్నా ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.9 శాతం మంది అమెరికాకు విదేశీ పర్యాటకులు తగ్గిపోయారు. నిరుడు జనవరితో పోల్చినపుడు ఈ ఏడాది జనవరిలో 4.7 శాతం పెరుగుదల కనిపించింది. నిరుడు ఏప్రిల్‌లో కన్నా ఈ ఏప్రిల్‌లో 1.3 శాతం మంది పెరిగారు.
భారత దేశం నుంచి అమెరికాకు వెళ్లే ప్రయాణికులు అక్టోబరు 1 నుంచి వీసా ఇంటెగ్రిటీ రుసుముగా 250 డాలర్లు (సుమారు రూ.22,000)ను చెల్లించవలసి ఉంటుంది. దీంతో మొత్తం వీసా ధర 442 డాలర్లు (సుమారు రూ.38,974) అవుతుంది. ఈ అదనపు భారాన్ని మెక్సికో, అర్జంటైనా, భారత్, బ్రెజిల్, చైనా వంటి నాన్ వీసా వెయివర్ దేశాల నుంచి వెళ్లే ప్రయాణికులు భరించవలసి ఉంటుంది.
ఇంటర్వ్యూ వెయివర్ లిస్ట్‌ను అమెరికా సవరించింది. దీంతో నాన్ ఇమిగ్రెంట్స్ సెప్టెంబరు నుంచి తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలకు హాజరుకావలసి ఉంటుంది. వయసు పద్నాలుగేళ్ల లోపు, 79 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారుల్లో అత్యధికులు ఇకపైన వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరుకావలసిందే. వీరికి ఇప్పటి వరకు మినహాయింపు ఉండేది. అయితే, వీసా వెయివర్ లిస్ట్‌లో ఉన్నవారు వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకానవసరం లేదు. కొన్ని రకాల బీ1/బీ2 వీసాహోల్టర్స్ మాత్రమే ఇంటర్వ్యూ వెయివర్ బెనిఫిట్‌కు అర్హులు.