Green Card | వాషింగ్టన్, ఆగస్టు 17: అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే ‘గ్రీన్ కార్డ్’ను పొందేందుకు ప్రవాస భారతీయులు నానా కష్టాలు పడుతున్నారు. గ్రీన్ కార్డు వెయిటింగ్ టైమ్..100 ఏండ్లకు చేరుకుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుల సంఖ్య 3.47 కోట్లకు చేరుకోగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల మందికి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశముందని అంచనా! ఈ నేపథ్యంలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు రావొద్దంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లోని వివిధ నగరాల్లో ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ ఫెయిర్స్’ నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొనాల్సిందిగా భారత్‌లో అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టీ చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. వర్సిటీ ప్రతినిధులు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని, మోసపోవ ద్దని మనవాళ్లను హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వెలువడు తున్నాయి.
ఆ దేశంలోనే శాశ్వతంగా బతకాలనుకుంటే ‘గ్రీన్ కార్డు’ పొందాల్సిందే. లేదంటే హెచ్1-బీ వీసా రెన్యూవల్ చేసుకుంటూ పోవాలి. కుదరకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి. ఎన్ని గ్రీన్ కార్డులు మంజూరు చేయాలన్నది అమెరికా చట్టసభ నిర్ణయిస్తుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కార్డులు 1,40,000 మాత్రమే ఉన్నాయి. టెక్నాలజీ, మెడిసిన్, అకడమిక్స్‌లో పనిచేస్తున్న 12 లక్షల మందికిపైగా ప్రవాస భారతీయులు కొన్ని దశాబ్దాలుగా ‘గ్రీన్ కార్డు’ కోసం ఎదురుచూస్తున్నారు.