న్యూఢిల్లీ: భారత్‌లో కెరీర్ కౌన్సెలింగ్ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం తేల్చింది. దాని ప్రకారం కేవలం 10 శాతం విద్యార్థులకు మాత్రమే కెరీర్‌కు సంబంధించిన సలహాలు లభిస్తున్నాయి లేదా దాని గురించి వారికి అవగాహన ఉంది. మిగతా 90 శాతం మంది కుటుంబ సభ్యుల సలహాలు, సామాజిక ఒత్తిడులు, ‘సురక్షితమైన’ ఉద్యోగాల ఆకర్షణలో పడిపోయి సరైన కెరీర్ ఎంపిక చేసుకోవడం లేదు. ఏడు రాష్ర్టాల్లో 9-12 తరగతులు చదువుతున్న 21,239 మంది విద్యార్థులను సర్వే చేసి ఐరాస ఈ అధ్యయనాన్ని వెలువరించింది.
గాలప్ 2024 గ్లోబల్ వర్క్ ప్లేస్ రిపోర్ట్ ప్రకారం కేవలం 14 శాతం భారతీయ ఉద్యోగులు మాత్రమే తాము కెరీలో అభివృద్ధి చెందుతున్నట్టు భావిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాలతో సంబంధం లేకుండా కెరీర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఈ అంతరం ఏర్పడిందని.. దీని వల్ల ఉద్యోగ అసంతృప్తి విస్తృతంగా వ్యాపించిందని నిపుణులు తెలిపారు. 10 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ కోర్సుల ఫీజు, ఎంపికలు, విద్యా సంస్థలు, అవకాశాల గురించి తెలుసు. ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ కౌన్సెలింగ్ లభించడం లేదు.
కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో అదొక ఖరీదైన వ్యవహారంగా ఉంది. భారత్‌లో చాలాచోట్ల వేలాది మంది విద్యార్థులకు ఒక కెరీర్ కౌన్సిలర్ కూడా ఉండటం లేదు. తల్లిదండ్రులు ఇంకా ఇంజినీరింగ్, వైద్య విద్య, సివిల్ సర్వీసెస్‌లను ఎంపిక చేసుకోవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. కెరీర్ కౌన్సెలింగ్ అంతరాన్ని కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కెరీర్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా, స్థానిక భాషల్లోని మొబైల్ అప్లికేషన్ల ద్వారా, ఆన్లైన్ మెంటార్షిప్ నెట్‌వర్క్‌ల ద్వారా కొంత మేరకు భర్తీ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.