న్యూఢిల్లీ, వాషింగ్టన్: కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే విధానాలను అమలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను సమర్థించారు. ‘ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం-2025’లో శనివారం ఆయన మాట్లాడుతూ& రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. “ఇది చమురుకు సంబంధించిన సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాకు దీనిని వర్తింపజేయడం లేదు. భారత్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు వినిపిస్తున్న వాదనలను చైనాకు వర్తింపజేయడం లేదు” అని అమెరికాను ఆయన ఎండగట్టారు. బాహ్య శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. “మీకు ఇష్టం లేకపోతే, కొనకండి. యూరోప్ దేశాలు కొంటున్నాయి, అమెరికా కొంటున్నది. మీకు ఇష్టం లేకపోతే, మా దగ్గర నుంచి కొనవద్దు” అని చెప్పారు.
పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచ మార్కెట్లను కుదిపేసినప్పటి పరిస్థితిని జైశంకర్ గుర్తు చేశారు. “2022లో చమురు ధరలు పెరుగుతున్నపుడు రష్యన్ చమురును కొనాలని భార త్ కోరుకుంటే, కొనుక్కోనివ్వండి అని అప్పు డు అన్నారు. ఎందుకంటే, దానివల్ల ధరలు నిలకడగా ఉంటాయి కాబట్టి” అని చెప్పారు. ఏదో ఒక దేశంపైన లేదా సరఫరా వ్యవస్థపైన మితిమీరి ఆధారపడకూడదని తాజా అనుభవాలు పాఠాలు నేర్పుతున్నాయన్నారు.
అమెరికాకు అంతర్జాతీయ తపాలా సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తపాలా శాఖ శనివారం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. గరిష్ఠంగా 800 డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసినపుడు వాటికి సుంకాల నుంచి మినహాయింపు ఉండేది. ఈ మినహాయింపును రద్దు చేస్తూ అమెరికా ప్రభుత్వం జూలై 30న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేసింది. ఈ నెల 29 నుంచి అమెరికాకు పంపించే అన్ని వస్తువులపైనా కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు. ఆ వస్తువుల విలువతో సంబంధం ఉండదు. 100 డాలర్ల వరకు విలువ గల గిఫ్ట్ ఐటమ్స్‌కు సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది.
అమెరికాకు ఇంటర్నేషనల్ మెయిల్‌ను తీసుకెళ్లే వైమానిక సంస్థలు ఈ అపరిష్కృత సమస్యల వల్ల, ఈ నెల 25 తర్వాత పోస్టల్ కన్సైన్మెంట్స్ను స్వీకరించేందుకు తమ అశక్తతను తెలిపాయని తపాలా శాఖ తెలిపింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు తమ వద్ద లేవని తెలిపాయని పేర్కొంది. ఈ నెల 25 నుంచి అమెరికాకు లేఖలు/పత్రాలు, గరిష్ఠంగా 100 డాలర్ల విలువైన గిఫ్ట్ ఐటమ్స్‌ను మాత్రమే అమెరికాకు పంపించేందుకు బుక్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. కొత్త నిబంధనల పరిధిలో లేని ఐటమ్స్‌ను ఇప్పటికే బుక్ చేసినవారు రిఫండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.
అమెరికాకు దిగుమతి అయ్యే ఫర్నీచర్‌పై మరో 50 రోజుల్లో టారిఫ్ విధిస్తానని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్ట్‌లో “అమెరికాలోకి వచ్చే ఫర్నిచర్‌పై భారీ టారిఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. రానున్న 50 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తవుతుంది” అని తెలిపారు. టారిఫ్ రేటును ఇంకా నిర్ణయించలేదన్నారు. చైనా, వియత్నాంల నుంచి అమెరికాకు అత్యధికంగా ఫర్నిచర్ ఎగుమతి అవుతుంది.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించి ఉన్న పరిస్థితుల్లో తన రాజకీయ సన్నిహిత సహాయకుడు సెర్గియో గోర్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. సెర్గియో అద్భుతమైన రాయబారి అవుతారు అని ట్రంప్ సోషల్ ట్రూత్‌లో పేర్కొన్నారు.
భారత్‌కు అనుకూలంగా అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేందుకు ఓ లాబీయింగ్ సంస్థతో వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది. మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ అనే ఈ సంస్థను మాజీ సెనేటర్ డేవిడ్ విట్టర్ నడుపుతున్నారు. అమెరికా రాజధాని నగరంలో దౌత్య సంబంధాలను పటిష్టపరచుకోవడం కోసం ఈ సంస్థను భారత్ నియమించింది. ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌కు సమర్పించిన దరఖాస్తు ప్రకారం, మెర్క్యురీ, ఇండియన్ ఎంబసీ మధ్య ఈ నెల నుంచి నవంబరు వరకు ఒప్పందం కుదిరింది.
భారత్ ఈ సంస్థకు నెలకు రూ.65,47,948 చొప్పున మూడు నెలలకు రూ.1,96,43,844 చెల్లిస్తుంది. సంక్లిష్టమైన అమెరికా రాజకీయ యవనికపై భారత్ వ్యవహరించాల్సన తీరుపై ఈ సంస్థ సలహాలు ఇస్తుంది. ఈ సంస్థకు చెందిన ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ కార్యాలయాల అధిపతిగా సుసీ వైల్స్ వ్యవహరించేవారు. ఆమె డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత సన్నిహితురాలు. ట్రంప్ దేశాధ్యక్షుడైన తర్వాత మెర్క్యురీ సంస్థను డెన్మార్క్, ఈక్వెడార్, అర్మేనియా, దక్షిణ కొరియా కూడా లాబీయింగ్ కోసం నియమించుకున్నాయి. భారత్‌పై టారిఫ్‌లను విధిస్తున్న తరుణంలో మెర్క్యురీని లాబీయింగ్‌కు నియమించుకోవడం గమనార్హం.