Birthright Citizenship | వాషింగ్టన్, జనవరి 23: జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నది. హెచ్1బీ, స్టడీ వీసాలపై వచ్చిన వారు, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులను ఈ నిర్ణయం కలవరపాటుకు గురి చేస్తున్నది. ముఖ్యంగా బిడ్డలకు జన్మనివ్వాల్సిన యువ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో పౌరసత్వం కోసం తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని సైతం ప్రమాదంలోకి పెట్టేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు ఫిబ్రవరి 20 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు.
అంటే, ఫిబ్రవరి 19 లోపు అమెరికాలో జన్మించిన బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత జన్మించే వారి తల్లిదండ్రుల్లో ఒకరైనా అమెరికన్ పౌరులు లేదా గ్రీన్కార్డుదారు అయితే తప్ప పౌరసత్వం రాదు. దీంతో బిడ్డల భవిష్యత్తుపై యువ దంపతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గర్భంతో ఉండి, మరో రెండు నెలల్లో డెలివరీ జరగాల్సిన వారు ఫిబ్రవరి 19 లోపే డెలివరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సీ-సెక్షన్లు చేయించుకునేందుకు వైద్యులను సంప్రదిస్తున్నారు.
తనను రెండు రోజుల్లో దాదాపు 20 మంది దంపతులు సీ-సెక్షన్ చేయాలని కోరినట్టు భారత సంతతికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్జీ ముక్కాల తెలిపారు. ఎనిమిది, తొమ్మిదో నెలల గర్భంతో ఉన్న వారు డెలివరీకి సమయం ఉన్నప్పటికీ సీ-సెక్షన్‌తో ఫిబ్రవరి 19 లోపు డెలివరీ చేయాలని కోరుతున్నట్టు న్యూ జెర్సీకి చెందిన డాక్టర్ ఎస్డీ రమ చెప్పారు. నెలలు నిండకముందే డెలివరీ చేయడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదమని, బిడ్డల్లో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం, నాడీ సంబంధ సమస్యలు, తక్కువ బరువుతో జన్మించడం వంటి సమస్యలు వస్తాయని వివరిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
కాగా, అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడంపై తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్‌కార్డులకు భారీగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వందేండ్లయినా గ్రీన్‌కార్డులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఇక్కడ పిల్లలకు జన్మతః పౌరసత్వం లభిస్తే 21 ఏండ్ల తర్వాత తల్లిదండ్రులకు కూడా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఇది ఒక మార్గం. దీంతో బిడ్డలకు జన్మతః పౌరసత్వం దక్కించుకోవడం కోసం తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు.
జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సియాటిల్ ఫెడరల్ న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఈ ఉత్తర్వును సవాల్ చేస్తూ 22 రాష్ర్టాలు, పలు వలసదారుల సంఘాలు దాఖలు చేసిన ఐదు పిటిషన్లలో ఇది ఒకటి. అరిజోనా, ఇలినాయిస్, ఓరెగాన్, వాషింగ్టన్ నుంచి దాఖలైన ఈ పిటిషన్లను న్యాయమూర్తి జాన్ కాఫెనోర్ విచారిస్తున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఇక్కడ జన్మించే బిడ్డలకు పౌరసత్వం లభిస్తుందని, ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌దారులు పేర్కొన్నారు.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేలా కీలక బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించింది. దొంగతనాలు, నేరాల కేసుల్లో నిందితులైన అక్రమ వలసదారులను నిర్బంధించేందుకు వీలుగా లాకెన్ రిలై యాక్ట్ పేరుతో ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించడంతో అధ్యక్షుడిగా ఈ పర్యాయం ట్రంప్ సంతకం చేయనున్న మొదటి బిల్లు ఇదే కానున్నది.
చట్టబద్ధమైన వలసలకే తమ మద్దతు ఉంటుందని, అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అమెరికా సహా ఏ దేశంలో అయినా తమ పౌరులు అక్రమంగా ఉంటున్నట్లయితే వారికి తిరిగి భారత్‌కు రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 18 వేల మంది భారతీయులను వెనక్కు పంపించనున్నారనే వార్తలపై ఆయన ఈ విధంగా స్పందించారు.