MATI: భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవ్స్ నేతలు చేసిన వ్యాఖ్యలను ‘మాల్దీవ్స్ అసోషియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (MATI)’ ఖండించింది. ప్రధాని మోదీపై వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు MATI ఒక ప్రకటన విడుదల చేసింది.
మాల్దీవ్స్‌కు అత్యంత సన్నిహిత దేశాల్లో భారత్ ఒకటని, భారత్‌తో మాకు మంచి అనుబంధం ఉన్నదని MATI తన ప్రకటనలో పేర్కొన్నది. మేం సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారి ముందుగా స్పందించే దేశం భారతేనని తెలిపింది. కరోనా సమయంలో కూడా భారత్, భారతదేశ ప్రజలు చేసిన మేలును మరువలేమంది.
మాల్దీవ్స్ పర్యాటక రంగం బలోపేతానికి కూడా భారత్ సహకారం మరువలేనిదని MATI పేర్కొంది. ఎప్పటిలాగే భారత్-మాల్దీవ్స్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపింది. కొందరు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అనుబంధంపై ప్రభావం చూపవని భావిస్తున్నామని అభిప్రాయపడింది.
కాగా, ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో మాల్దీవ్స్‌కు చెందిన కొందరు మంత్రులు, ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో మాల్దీవ్స్ ప్రభుత్వం ముగ్గురు మంత్రులపై సస్పెన్స్ వేటు వేసింది. అధికారులపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో MATI తాజా ప్రకటన చేసింది.