ఆదివారం 31 మే 2020
International - May 19, 2020 , 20:00:05

డబ్ల్యూహెచ్‌వోకు ట్రంప్‌ హెచ్చరిక

డబ్ల్యూహెచ్‌వోకు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై కారాలు మిరియాలు నూరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆ సంస్థకు తుది హెచ్చరిక జారీ చేశారు. చైనా చేతుల్లోంచి బయటపడి స్వతంత్రంగా వ్యవహరించకపోతే తాము సంస్థ నుంచి శాశ్వతంగా వైదొలుగుతామని హెచ్చరించారు. 30 రోజుల్లోగా తన విధానాన్ని మార్చుకోకపోతే తాము  డబ్ల్యూహెచ్‌వోకు ఇచ్చే నిధులను శాశ్వతంగా నిలిపివేస్తామని ఆ సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రియేసుస్‌కు సోమవారం రాసిన లేఖలో స్పష్టంచేశారు. 

‘కొవిడ్‌-19 వైరస్‌ విషయంలో మీరు, మీ సంస్థ పదేపదే చేస్తున్న తప్పుల కారణంగా ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. ఇక డబ్ల్యూహెచ్‌వో ముందుకెళ్లటానికి ఉన్న ఏకైక మార్గం చైనా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రంగా వ్యవహరించటమే. అమెరికా అధ్యక్షుడిగా నా బాధ్యతగా చెప్తున్న.. ఈ విషయంలో వచ్చే 30 రోజుల్లో డబ్ల్యూహెచ్‌వో స్థిరమైన చర్యలు తీసుకోకపోతే తాత్కాలికంగా నిలిపేసిన మా నిధులను శాశ్వతంగా రద్దుచేస్తాం. సంస్థలో మా సభ్వత్వం గురించి కూడా పునరాలోచిస్తాం’ అని తీవ్రంగా హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా ఏటా 500 మిలియన్‌ డాలర్ల విరాళం ఇస్తున్నది. కరోనా విషయంలో సంస్థ తీరుపై గుర్రుగా ఉన్న ట్రంప్‌ ఇటీవలే ఆ నిధులను తాత్కాలికంగా నిలిపేశారు.


logo