ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీషణ ప్రతిజ్ఞలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇమ్రాన్ సిద్ధపడిపోయారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఆదివారం జరిగే ర్యాలీ వేదికగా ప్రకటించనున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందేకు రెడీ అయిన విషయం తెలిసిందే. సోమవారం అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెడతారు.
దీని ద్వారా తనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయని ముందే గ్రహించిన ఇమ్రాన్… అటు విపక్షాలకు దొరకకుండా, తన రాజకీయ భవితవ్యం నవ్వులపాలు కాకుండా ఉండేందుకు ముందస్తుకు తెర లేపారు. ఇస్లామాబాద్ వేదికగా జరిగే సభలో ఆయన తన రాజీనామాను ప్రకటించే ఛాన్స్ ఉందని పాక్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. రాజీనామా ప్రకటించి, ముందస్తుకు వెళ్తున్నట్లు స్పష్టమైన ప్రకటన కూడా చేస్తారని పేర్కొంటున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ గద్దెనెక్కడంలో పాక్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. చాలా కాలం పాటు ఆర్మీకి, ప్రధాని ఇమ్రాన్‌కి ఎన్నడూ లేనంతగా సత్సంబంధాలే వున్నాయి. కానీ హఠాత్తుగా ఈ సంబంధాలు చెడిపోయాయి. ఆర్మీ ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితం సమావేశమై, ఇమ్రాన్‌ను రాజీనామా చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వా కూడా ఈ విషయాన్ని ప్రధాని ఇమ్రాన్ మొహం మీదే చెప్పేశారని వార్తలు కూడా వచ్చాయి. అటు ప్రతిపక్షాలు, ఇటు ఆర్మీ… ఇద్దరూ తనకు వ్యతిరేకంగా మారడంతో… రాజీనామా చేసి, ముందస్తుకు వెళ్లాలని ఇమ్రాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.