Pak PM Imran Khan | పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని పాక్ సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.
శనివారం నాడు నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని ఇమ్రాన్‌ఖాన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆదివారం డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మానం పాక్ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు. విపక్షాల అవిశ్వాస తీర్మానం పాక్ రాజ్యాంగంలోని 95వ అధికరణం ప్రకారం నిబంధనల ఉల్లంఘనేనన్నారు.
ఆ వెంటనే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తాజా ప్రజా తీర్పు కోరాలని నిర్ణయించారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశాధ్యక్షుడికి సూచించారు. తాజా ఎన్నికలు 90 రోజుల్లో నిర్వహించాలని ప్రతిపాదించారు. అవిశ్వాసం రాజ్యాంగ విరుద్ధం అంటూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌ను విపక్షాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి.