Pakistan | ఇస్లామాబాద్: భారత్ ఎటువంటి చొరబాట్లకు కాని పాకిస్థాన్ భద్రతను దెబ్బతీసే ప్రయత్నం కాని చేసిన పక్షంలో పాకిస్థాన్ నుంచి చారిత్రాత్మక జవాబును ఎదుర్కోవలసి వస్తుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మంగళవారం పునరుద్ఘాటించారు. పాకిస్థాన్‌పై దాడి చేసేందుకు భారత్ సాహసిస్తే ఎవరూ ప్రాణాలతో ఉండరని ఆయన హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్ పాక్‌పై అనేక దౌత్య, ఆర్థికపరమైన ఆంక్షలతోపాటు సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. పాక్‌పై భారత్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చని తమ వద్ద నిఘా సమాచారం ఉన్నట్లు ఆసిఫ్‌తోపాటు పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ‘మేము లేకపోతే ఇక ఎవరూ మిగలరు’ అని ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆసిఫ్ తెలిపారు.
జాతీయ భద్రతపై పాక్ పార్లమెంట్ సమావేశం
కీలక మంత్రుల గైర్హాజరుపై విపక్షాల ఆగ్రహం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి దిగుతుందన్న ఊహాగానాల నడుమ మంగళవారం పాక్ పార్లమెంట్ కీలక సమావేశాన్ని నిర్వహించింది. జాతీయ భద్రతపై నిర్వహించిన ఈ సమావేశానికి అధికార పార్టీకి చెందిన కీలక మంత్రులు, పలువురు ఎంపీలు హాజరుకాకపోవటంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలోని ముఖ్య నేతల్లో ఒకరైన జేయూఐ చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహమాన్ షెహబాజ్ షరీఫ్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి రెహమాన్, జేయూఐ ఎంపీలు వాకౌట్ చేశారు. భారత్‌కు దీటుగా స్పందించటం లేదంటూ పలువురు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సభలో షెహబాజ్ సర్కార్, భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా యుద్ధ చర్యలు చేపడుతున్నదని ఆ తీర్మానంలో పాక్ ఆరోపించింది.