Qatar | ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం మంగళవారం దాడులు జరిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ దాడికి బాధ్యత వహించింది. హమాస్ అగ్రశ్రేణి ఉగ్రవాద నాయకులపై నేటి చర్య పూర్తిగా స్వతంత్ర ఆపరేషన్ అని.. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించి.. నిర్వహించిందని.. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత వహిస్తుందని పీఎం కార్యాలయం పేర్కొంది. ఖతార్ స్టేట్ ప్రసార సంస్థ అల్ జజీరా దాడులను ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే తమ వైమానిక దళం హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కానీ, దాడి ఎక్కడ జరిగిందో స్పష్టంగా చెప్పలేదు.
ఇజ్రాయెల్ సైన్యం దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని ఇజ్రాయెల్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. అదే సమయంలో ఖతార్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడి పిరికిపంద చర్య అని.. దోహాలోని హమాస్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని మండిపడింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (PLO) దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించింది. ఈ దాడిని అసహ్యకరమైందని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ చట్టం, ఖతార్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆరోపించింది. పీఎల్‌వో సెక్రటరీ జనరల్ హుస్సేన్ అల్ షేక్ మాట్లాడుతూ ఈ దాడి ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వానికి ముప్పుగా పేర్కొన్నారు. ఇరాన్ దోహాలో హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైతం విమర్శించారు.
ఈ దాడిని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం అభివర్ణించారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖై స్టేట్ టెలివిజన్‌లో మాట్లాడుతూ ‘ఇది చాలా ప్రమాదకరమైన నేరపూరిత చర్య. అంతర్జాతీయ నియమాలు, చట్టాలను, ఖతార్ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘించడం’ అని ఆరోపించారు. ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత యైర్ లాపిడ్ దోహాలో జరిగిన దాడిని ప్రశంసించారు. శత్రువులను ఆపడానికి ఈ అసాధారణ చర్య తీసుకున్నందుకు వైమానిక దళం, ఐడీఎఫ్, షిన్ బెట్ (ఇంటెలిజెన్స్ ఏజెన్సీ)తో పాటు భద్రతా దళాలను అభినందిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
Prime Minister’s Office:
Today’s action against the top terrorist chieftains of Hamas was a wholly independent Israeli operation.
Israel initiated it, Israel conducted it, and Israel takes full responsibility.
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) September 9, 2025