బీరట్: హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన రాకెట్-మిస్సైల్ దళాధిపతి కమాండర్ ఇబ్రహీం ఖబాయిసి .. ఇజ్రాయిల్ వైమానిక దాడిలో మృతిచెందాడు. బీరట్ శివారులోని దహియేపై జరిగిన అటాక్‌లో అతను చనిపోయినట్లు ద్రువీకరించారు. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ విషయాన్ని తెలిపింది. హిజ్బొల్లాకు మిస్సైల్ సామర్థ్యాన్ని అందించడంలో గత కొన్ని దశాబ్ధాలుగా ఇబ్రహీం కీలక పాత్ర పోషించాడు. ఇబ్రహీంతో పాటు ఇద్దరు హై ర్యాంక్ హిజ్బొల్లా కమాండర్లు హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హిజ్బొల్లా కూడా ఇబ్రహీం మృతిని ద్రువీకరిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. అతను వీరమరణం పొందినట్లు పేర్కొన్నది. 1980 దశకంలో ఇబ్రహీం తమ గ్రూపులో జాయిన్ అయినట్లు తెలిపింది. అనేక క్షిపణి, రాకెట్ యూనిట్లకు కమాండర్‌గా చేశాడతను. ప్రిసిసన్ గైడెడ్ మిస్సైల్ యూనిట్‌కు కమాండర్‌గా కూడా చేశాడు. ఇజ్రాయిల్‌పై జరిగిన మిస్సైల్ దాడిలో ఇబ్రహీం ఆదేశాలు ఉన్నాయి. మిస్సైల్ రంగంలో ఖుబాయిసికి అపారమైన పరిజ్ఞానం ఉన్నదని, హిజ్బొల్లా సీనియర్ మిలిటరీ నాయకులతో అతనికి లింకులు ఉన్నట్లు తేలింది.