Israel : గాజాలో హమాస్ తీవ్రవాదులు అపహరించి, బంధీలుగా ఉంచుకున్న వారందరికీ విముక్తి కలిగిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, బంధీలలో కొందరు మరణించగా.. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. బంధీలలో చివరిగా మిగిలి ఉన్న ఏకైక వ్యక్తి ర్యాన్ గ్విలి అస్థికల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఒక సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది.
దీని ప్రకారం.. ఇజ్రాయెల్ దళాలు, పోలీసులు కలిసి అతడి అస్థికల్ని సేకరించారు. ఇజ్రాయెల్ పోలీస్ విభాగంలో పని చేస్తున్న గ్విలిని అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు హత్య చేసి, అతడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. హమాస్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో 251 మందిని బంధీలుగా ఎత్తుకెళ్లారు. వీరిలో కొందరిని హమాస్ తీవ్రవాదులు హత్య చేశారు. తీవ్రంగా వేధించారు. ఈ నేపథ్యంలో గాజాపై ఐడీఎఫ్ దాడి చేసింది. రెండేళ్లకుపైగా సాగిన ఈ యుద్ధాన్ని గత ఏడాది అక్టోబర్లో అమెరికా సూచనతో ముగించారు. శాంతి ఒప్పందం మేరకు హమాస్ తీవ్రవాదులు తమ వద్ద ఉన్నవారిని అప్పగించారు. కొందరి మృతదేహాల్ని ఇచ్చారు.
చివరగా మిగిలి ఉన్న గ్విలి అస్థికల్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అతడి కుటుంబానికి వాటిని అప్పగించి, అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపింది. చివరకు బంధీలుగా ఉన్న వారందరినీ విడిపించుకోవడం ఆనందంగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇది ఐడీఎఫ్ సాధించిన విజయంగా వర్ణించారు.