న్యూఢిల్లీ: ఇండియాలో తనకు మద్దతు ఎక్కువగా ఉందని, ఫాలోవర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ(PM Netanyahu) తెలిపారు. ఇజ్రాయిల్, ఇండియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన మాట్లాడారు. ప్రాంతీయ వ్యూహాత్మకం, కూటమి, టెక్నాలజీ వృద్ధిపై ఆయన ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ.. భారత్ తమకు కీలకమైన భాగస్వామి అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఇజ్రాయిల్‌ను వేరుగా చూస్తున్నాయని ఆరోపించారు. కానీ భారత్‌లో మాత్రం తమకు మంచి గుర్తింపు ఉన్నట్లు నెతన్యహూ చెప్పారు.
భారత్‌లో ఇజ్రాయిలీలకు అమితమైన ప్రేమ ఉందని, నిజంగా ఎక్కువగా అభిమానిస్తారని, ఇతర దేశాల కన్నా ఇండియాలో తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నట్లు నెతన్యహూ తెలిపారు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ శక్తులతో స్నేహ హస్తాన్ని చాచేందుకు ఇజ్రాయల్ ప్రయత్నిస్తున్నది. ఈ సందర్భంగా నెతన్యహూ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్‌ను గొప్ప శక్తిగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ పోల్చారు. పశ్చిమాసియా దేశాలతో ఉన్న పరిస్థితిని మరింత బలోపేతం చేయాలన్నారు.
వివిధ దేశాలతో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని భావిస్తున్నామని, భారత్ లాంటి గొప్ప శక్తివంతమైన దేశంతో మరింత విశిష్టమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయిలీ సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణ, ఆర్థిక వృద్ధి పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని, దీనిలో భాగంగానే కొన్ని దేశాలు తమతో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.