టంపా(యూఎస్), అక్టోబర్ 10: హెలెన్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాపై మరో తుఫాన్ విరుచుకుపడింది. మిల్టన్ తుఫాన్ బుధవారం ఫ్లోరిడాను కుదిపేసింది. గంటకు 160 కి.మీ వేగంతో వీచిన గాలులు అనేక నగరాలను దెబ్బతీశాయి. టంపా నగరలో రికార్డు స్థాయిలో 41 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో వరదలు పోటెత్తాయి. తుఫాన్ ధాటికి నలుగురు మృతిచెందారు.
30 లక్షల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెయింట్ పీటర్స్బర్గ్ నివాసితులకు నీటి సరఫరా ఆగిపోయింది. మిల్టన్ తుఫాను కారణంగా ఫ్లోరిడా తీరంలో వరదలు సంభవించాయి. దక్షిణ ఫ్లోరిడాను భారీ వర్షాలు, టోర్నడోలు బుధవారం నుంచి ముంచెత్తాయి.
15 కౌంటీల్లోని సుమారు 70 లక్షల మంది ప్రజలను తప్పనిసరిగా నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. తుఫాను కారణంగా 1900 విమానాలను రద్దు చేశారు. కాగా, పశ్చిమ ఫ్లోరిడాలో రెండు వారాల క్రితం హెలెన్ తుఫాన్‌కు 230 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.