ఫ్లోరిడా: ఫ్లోరిడా తీరంలో ఇడాలియా హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో బుధవారం ఫ్లోరిడా వ్యాప్తంగా భీకర గాలులు, కుండపోత వర్షం కురిసింది. గాలికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి. క్యాటగిరీ 4 తుఫానుగా రూపాంతరం చెందిన ఇడాలియా తీవ్ర రూపం దాల్చింది. ఫ్లోరిడాలోని 28 కౌంటీల్లో దీని ప్రభావం కనిపించింది. ఫ్లోరిడా మీదుగా సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, జార్జియా వైపు ఈ హరికేన్ దూసుకెళ్తున్నది.
మియామిలోని నేషనల్ హరికేన్ సెంటర్ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. గురువారం కూడా దీని ప్రభావం ఉంటుందని, ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినాలో 10-20 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.