Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) (Pakistan Tehreek-i-Insaf) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు తరలిరాగా.. వారిని అడ్డుకునేందుకు వేలాదిమంది పీటీఐ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
ఇమ్రాన్‌ఖాన్ బెయిల్ రద్దు చేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పోలీసు వాహనాలు, ఖైదీలను తరలించే వ్యాన్లు ఇమ్రాన్ నివాసం సమీపంలోని జమాన్ పార్క్‌వైపు సైరన్ల మోత మోగిస్తూ వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన పీటీఐ కార్యకర్తలు, నేతలు ఇమ్రాన్ నివాసం వైపు కదిలారు. జెండాలు చేతపట్టి ఇమ్రాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయాలని చూస్తే దేశం మొత్తం వీధుల్లోకి వచ్చి నిరసన చేపడతుందని పీటీఐ నేత ముసారత్ జంషైద్ చీమా హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ గత ఏడాది అక్టోబరులో ఇచ్చిన ‘తోషిఖానా తీర్పు’ (విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులను పర్యవేక్షించే విభాగం)పై ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ పాకిస్థాన్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇమ్రాన్‌పై అప్పట్లో కేసు నమోదైంది. అయితే, గతేడాది నంబరులో వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ కారణాలతో ఇమ్రాన్ ప్రస్తుతం ఈ కేసులో బెయిలుపై ఉన్నారు.
కోర్టు ఎదుట హాజరు కావడానికి ఇమ్రాన్‌కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, కానీ ఆయన విఫలమయ్యారంటూ ఇస్లామాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) న్యాయమూర్తి రజా జవాద్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇమ్రాన్ బెయిల్‌ను రద్దు చేశారు. అయితే, గతేడాది జరిగిన దాడి నుంచి ఇమ్రాన్ ఇంకా కోలుకోలేదని.. ఈసారి మినహాయింపు ఇవ్వాలన్న ఇమ్రాన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనలను తిర్కరించిన ప్రధాన న్యాయమూర్తి.. మధ్యంతర బెయిలును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ పరిణామంతో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.