వాషింగ్టన్: అందంగా కనిపించాలంటే చర్మ సౌందర్యమే ఇంపార్టెంట్. వయసు పెరుగుతున్నా కొద్దీ.. చర్మం తన సహజ తేజస్సును కోల్పోతోంది. అయితే శాస్త్రవేత్తలు తాజాగా ఓ కొత్త పరిశోధన చేపట్టారు. చర్మ కణాల వయసును 30 ఏండ్ల మేర తగ్గించారు. 60 దశకంలోనూ మళ్లీ నిగనిగలాడే రీతిలో చర్మాన్ని డెవలప్ చేశారు. దీనికి సంబంధించిన పరిశోధనను కేంబ్రిడ్జ్‌లోని బ్రాబ్రహమ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చేపట్టారు. ప్రొఫెసర్ వోల్ఫ్ రీక్ ఈ విషయాన్ని తన స్టడీ రిపోర్ట్‌లో తెలిపారు.
వయసు పెరుగుతున్నా.. ఈ తాజా టెక్నిక్‌తో మనుషులు యంగ్‌గానే కనిపిస్తారని ప్రొఫెసర్ వోల్ఫ్ తెలిపారు. అయితే ఈ స్టడీకి చెందిన ఫలితాలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయన్నారు. రిజెనరేటివ్ మెడిసిన్‌లో ఇదో విప్లవం అవుతుందన్నారు. ఇదే తరహా పరిశోధనలను ఇతర మానవ కణాల్లోనూ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈలైఫ్ అనే పత్రికలో చర్మ కణాల పరిశోధనకు సంబంధించిన కథనాన్ని ప్రచురించారు. 53 ఏళ్ల మహిళ చర్మ కణాలపై స్టడీ నిర్వహించి.. ఆమె కణాలు 23 ఏండ్ల వయసులో ఎలా మెరుస్తాయో అలా డెవలప్ చేశారు. వయసు సంబంధిత రుగ్మతలకు చికిత్సను అభివృద్ధి చేసే క్రమంలో ఈ పరిశోధన చేపట్టామన్నారు. డయాబెటిస్, హార్ట్, న్యూరో సంబంధిత రోగాల చికిత్సకు ఈ విధానాన్ని వాడనున్నారు.