Volodymyr Zelenskyy : రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi).. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ (Vlodimir Putin) ను కౌగిలించుకోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) స్పందించారు. భారత్, రష్యా దేశాధినేతల కౌగిలి తనను తీవ్రంగా నిరాశపర్చిందనే విషయాన్ని ఆయన వారి ప్రస్తావన తేకుండా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పరోక్షంగా తెలియజేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. వీరిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ భేటీ తమను నిరాశపర్చిందని వెల్లడించారు.
‘ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. 13 మంది పిల్లలు సహా 170 మంది గాయపడ్డారు. ఆ వెంటనే మరో చిన్నారుల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఎంతోమంది శిథిలాల కింద సమాధి అయ్యారు. అలాంటి రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నాయకుడు (మోదీ).. ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడిని (పుతిన్) మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశ కలిగించింది. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిదే’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.
‘రష్యా దాడికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా రష్యాలో మోదీ పర్యటన సమయంలోనే ఉక్రెయిన్‌పై మాస్కో క్షిపణుల వర్షం కురిపించింది. ఐదు నగరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులను ప్రయోగించింది. ఇందులో అనేక అపార్ట్మెంట్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు కూలిపోయాయి’ అని జెలెన్స్కీ తెలిపారు.
కాగా, రష్యా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవని, చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలని భేటీలో ప్రధాని మోదీ పుతిన్‌కు సూచనలు చేసినట్లు సమాచారం.