Hug controversy : మ్యాచ్ ముగిసిన అనంతరం హోటల్‌కు వెళ్తున్న ఫుట్‌బాలర్‌ను ఓ మహిళా అభిమాని కలిసింది. అదే అతని పాలిట శాపమైంది. ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్ (Tehran) లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇరాన్‌కు చెందిన హై ప్రోఫైల్ ఫుట్‌బాలర్ రమీన్ రెజియాన్ (Ramin Razaian) ఇరాన్‌లోని పురాతన ఫుట్‌బాల్ క్లబ్ అయిన టెహ్రాన్స్ ఎస్తెగ్లాల్ (Tehran’s Esteghlal) కు డిఫెండర్‌గా ఆడుతున్నాడు.
ఇటీవల ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టుతో కలిసి బస్సు ఎక్కేందుకు స్టేడియం బయటికి వచ్చిన రమీన్ రెజియాన్ను ఓ మహిళా అభిమాని కలిసింది. ఈ సందర్భంగా రెజియాన్ ఆమెను కౌగిలించుకున్నాడు. ఇరాన్లో బహిరంగ కౌగిలింతలు నిషేధం కావడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఇరాన్ ప్రభుత్వంతోపాటు ఆ దేశానికి చెందని సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్ సామాజిక నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు రమీన్ రెజియాన్కు అక్కడి ప్రభుత్వం సమన్లు జారీచేసింది. సంబంధిత దర్యాప్తు అధికారుల ముందు హాజరై కౌగిలింత ఘటనపై సమాధానం ఇవ్వాలని ఆ సమన్లలో పేర్కొంది. గత ఏప్రిల్‌లో కూడా ఓ ఫుట్‌బాలర్ మహిళా అభిమానిని కౌగిలించుకున్నందుకు అతనికి భారీ జరిమానా విధించారు. ఒక మ్యాచ్‌పై నిషేధం విధించారు.