Maria Corina : వెనెజువెలా (Venezuela) విపక్ష నేత మరియా కొరీనా మచాడో (Maria Corina Machado) అజ్ఞాతం వీడి ఇటీవల నార్వేలోని ఓ హోటల్ వద్ద కనిపించారు. ప్రతిష్ఠాత్మక నోబెల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరు కాలేకపోయినప్పటికీ.. హోటల్ వద్ద ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో వెనెజువెలా నుంచి ఆమె ఎలా వచ్చారనే విషయం చర్చనీయాంశమైంది.
అయితే ఆమెను తరలించేందుకు అమెరికాకు చెందిన మాజీ సైనిక నిపుణులు ఓ రహస్య ఆపరేషన్ చేపట్టినట్లు తెలిసింది. వేషం మార్చి, పడవల్లో ఓ ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ నుంచి నార్వేకు తరలించినట్లు సమాచారం. కాగా వెనెజువెలాలో నిషేధాన్ని ఎదుర్కొంటున్న మచాడో.. బయటకు వస్తే అధికారులు అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఞాతంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆమె దాన్ని ఎలాగైనా స్వీకరించాలని నిశ్చయించుకున్నారు.
ఆ మేరకు నార్వేకు వెళ్లేందుకు సాయం కోసం అమెరికా మాజీ సైనికాధికారుల నేతృత్వంలో నడుస్తున్న గ్రే బుల్ రెస్క్యూ ఫౌండేషన్‌ను మచాడో సంప్రదించారు. ఆ సంస్థ చీఫ్ బ్రెయాన్ స్టెర్న్ అందుకు అంగీకరించి కార్యాచరణ రూపొందించారు. ‘ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్’ చేపట్టి విజయవంతంగా ఆమెను గమ్యానికి చేర్చారు. డైనమైట్ను కనుగొన్న అల్ఫ్రెడ్ నోబెల్‌కు గుర్తుగా ఆపరేషన్‌కు ఆ పేరును ఎంచుకున్నట్లు బ్రెయాన్ స్టెర్న్ చెప్పారు.
వెనెజువెలా రాజధాని కారకస్‌లో దాక్కున్న మచాడోను తీరానికి చేర్చేందుకు బ్రియాన్ బృందం సముద్ర మార్గాన్ని ఎంచుకుంది. అయితే అప్పుడు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో పది మీటర్ల మేర అలలు ఎగసిపడుతున్నాయి. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో మచాడోను తప్పించేందుకు చేపల పడవలను ఉపయోగించారు. తీవ్రమైన చలిలో పూర్తి చీకటిలోనే ప్రయాణం సాగింది. కమ్యూనికేషన్ల కోసం ఫ్లాష్‌లైట్ వినియోగించారు.
అత్యంత భయానక వాతావరణంలో ప్రయాణం కొనసాగింది. ఎట్టకేలకు రెండు పడవలను మార్చి మచాడోను కరేబియన్ తీరానికి చేర్చారు. అంతకుముందు మచాడోను గుర్తుపట్టకుండా ఉంచేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతాదళాల తనిఖీలు, అరెస్టు నుంచి తప్పించేందుకు ఆమె వేషం మార్చారు. విగ్గు ధరింపజేశారు. ఆయా చెక్‌పోస్టుల్లో డిజిటల్ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. ఫోన్ ద్వారా ఆమెను ట్రేస్ చేయకుండా చర్యలు తీసుకున్నారు.
ఓ సురక్షిత ప్రాంతానికి చేరుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో గమ్యానికి చేర్చారు. ఇలా మొత్తంగా మచాడోను నార్వేకు తరలించేందుకు దాదాపు మూడు రోజుల సమయం పట్టినట్లు సమాచారం. కాగా కారకస్ నుంచి మచాడోను బయటకు తీసుకెళ్లేందుకు ఇదే మొదటి ప్రయత్నం కాదని, గతంలోనూ ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. నార్వేకు తరలించేందుకు మచాడో బృందం బ్రెయాన్ స్టెర్న్‌ను డిసెంబర్ ప్రారంభంలో సంప్రదించగా.. ఆయన పలు మార్గాలను అన్వేషించారు.
చివరకు సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. కారకస్ భద్రతా దళాల కంట పడకుండా ఉండేందుకు ఇదే ఉత్తమ మార్గమని భావించామని స్టెర్న్ వెల్లడించారు. కొన్నిసార్లు అనధికార ఆపరేషన్లు చేపడతామని, ఇందుకు సాయం చేసిన స్థానికుల వివరాలు బయటకు రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఒక్కోసారి ఆపరేషన్‌లో భాగమైన విషయం సాయం చేసిన వారికీ తెలియదని చెప్పారు. కాగా గత ఏడాది జూలైలో జరిగిన వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అధ్యక్షుడు నికోలస్ మదురో అక్రమ మార్గంలో అధికారాన్ని చేపట్టారని మచాడో ఆరోపించారు. దాంతో ఆమె నిషేధానికి గురయ్యారు. ఆ నిషేధం మూలంగా కొంతకాలం నుంచి అజ్ఞాతంలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రజాస్వామ్యం, శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్న ఆమెను నోబెల్ శాంతి బహుమతి-2025 వరించింది. వెనెజువెలా నుంచి తప్పించుకొని నార్వేకు చేరుకోవడం ఆలస్యం కావడంతో మచాడో తరఫున ఆమె కుమార్తె నోబెల్ పురస్కారాన్ని స్వీకరించారు.