Donald Trump | వాషింగ్టన్, మే 23: హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి అడ్డుకున్నారు. స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్(ఎస్ఈవీపీ) కింద అంతర్జాతీయ విద్యార్థులకు డిగ్రీ విద్యను అందచేస్తున్న హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బోస్టన్ ఫెడరల్ కోర్టు శుక్రవారం తాత్కాలికంగా నిలుపుదల చేసింది.
మసాచుసెట్స్‌లోని అమెరికా జిల్లా కోర్టులో హార్వర్డ్ దాఖలు చేసిన దావాపై ఫెడరల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైట్ హౌస్ రాజకీయ డిమాండ్లను తిరస్కరించినందుకు ప్రతీకారంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యకు ట్రంప్ ప్రభుత్వం పాల్పడినట్లు తన వ్యాజ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ ఆరోపించింది.
7,000 మందికి పైగా వీసా దారులైన అంతర్జాతీయ విద్యార్థులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వర్సిటీ తెలిపింది. కాగా, ఎస్ఈవీపీని రద్దు చేస్తున్నట్లు హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నీమ్ తెలియచేశారు. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని ఆమె తెలిపారు. హార్వర్డ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో దాదాపు 500 నుంచి 800 మంది భారతీయ స్కాలర్లు, విద్యార్థులు చేరుతుంటారు. ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు ఇందులో చదువుతున్నారు.