రియోడి జనెరియో, జూన్ 21: ఆకాశంలో ఉండగా, హాట్ ఎయిర్ బెలూన్‌కు నిప్పంటుకుని కింద కూలిన ప్రమాదంలో 8 మంది మరణించిన ఘటన బ్రెజిల్లో శనివారం చోటుచేసుకుంది. శాంత కతర్నియా జిల్లాలో చోటుచేసుకున్న ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోను స్థానిక వార్తా సంస్థ జీ1 విడుదల చేసింది. దాని ప్రకారం భారీగా ఎగసిన మంటల్లోంచి పొగలు వస్తుండగా, ఆకాశం నుంచి దూసుకు వచ్చిన బెలూన్ నేలపై పడింది.
ప్రమాద సమయంలో 21 మంది బెలూన్‌లో ఉండగా, వారిలో 8 మంది మరణించారని, గాయపడిన 13 మందిని దవాఖానలకు తరలించినట్టు మిలిటరీ ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. ప్రమాదానికి కారణం తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. జూన్ నెలలోసెయింట్ జాన్ వంటి క్యాథలిక్ గురువుల ఉత్సవాల సందర్భంగా ఈ హాట్ బెలూన్లపై పౌరులు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు.