Covid variant H V.1 | నాలుగేండ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా.. మళ్లీ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కొవిడ్-19 హెచ్వీ.1 వేరియంట్ అమెరికా అంతటా వ్యాపిస్తున్నది. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5, అకా ఎరిస్ పహా గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఎక్కువ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది ‘హెచ్వీ.1’.
అక్టోబర్ నెలాఖరు నాటికి అమెరికా వ్యాప్తంగా నమోదైన కొవిడ్-19 కేసుల్లో నాలుగో వంతు హెచ్వీ.1 వేరియంట్ కేసులే ఉన్నాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. గత నెల 28తో ముగిసిన రెండు వారాల్లో హెచ్వీ.1 వేరియంట్ కేసులు 25.2 శాతం ఉన్నాయి. దీంతో ప్రస్తుత శీతాకాలంలో ‘హెచ్వీ.1’ వేరియంట్ ఇతరులకు వ్యాపించకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలపై అధికారులు కేంద్రీకరించారు. ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్ ‘హెచ్వీ.1’ వేరియంట్ అని వండర్ బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ విలియం స్కాఫ్నర్ చెప్పారు.
జూలైలో హెచ్వీ.1 వేరియంట్ కేసులు 0.5 శాతం మాత్రమే. గత సెప్టెంబర్ నాటికి 12.5 శాతానికి పెరిగాయి. హెచ్వీ.1 వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి వంటి లక్షణాలు ఉంటాయని అమెరికా వైద్యులు చెబుతున్నారు.