Reverses Ageing | వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. వయసుతోపాటు శరీరంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అయితే వయసు పెరిగినా శరీరం నిత్య యవ్వనంలా కనిపించేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు. ఈ దిశగా హార్వర్డ్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వయసును తగ్గించే కెమికల్ కాక్టెయిల్స్ను తాము అభివృద్ధి చేశామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలు ఈ నెల 12న ఏజింగ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
‘జీన్ థెరపీ ద్వారా వయసు తగ్గించొచ్చని మేం ఇదివరకే కనుగొన్నాం. తాజాగా కెమికల్ కాక్టెయిల్స్ ద్వారానూ ఇది సాధ్యపడుతుందని మేం గుర్తించాం. శరీరం పునరుజీవింప చేసే దిశగా ఇది కీలక ముందడుగు’ అని హార్వర్డ్ పరిశోధకులు డేవిడ్ సిన్క్లయిర్ ట్విట్టర్లో వెల్లడించారు.
ప్రతి కెమికల్ కాక్టెయిల్లోనూ ఐదు నుంచి ఏడు ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఇతర శారీరక, మానసిక రుగ్మతల చికిత్సకు వినియోగించేవే. కణాల వయసును తగ్గించి, వాటిని పునరుజ్జీంపజేసే మాలెక్యూల్స్ను కనుగొనేందుకు తాము మూడేండ్లపాటు శ్రమించినట్టు డేవిడ్ తెలిపారు. మెదడు కణజాలం, కిడ్నీ, కండరాలపై చేసిన పరిశోధనల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. కోతులు, ఎలుకలపై ఈ అధ్యయనం నిర్వహించినట్టు చెప్పారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వచ్చే ఏడాది ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని వెల్లడించారు.